పదిమందిలో భారతి పరువు పోయిందిగా!

భార్య చేసే పనులకు భర్త తిట్లు తినాలి.. భర్త చేసే పనులకు భార్య అక్షింతలు వేయించుకోవాలి.. ఇదీ భార్యాభర్తల మధ్య వుండే విచిత్రబంధం. ముఖ్యమంత్రి హోదాలో జగన్ చేసిన అనేక తలతిక్క పనుల్లో ఒక తలతిక్క పని రైతుల పట్టాదారు పాస్ పుస్తకాల మీద తన ఫొటో ముద్రించుకోవడం. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కొన్ని సందర్భాల్లో మాత్రమే ముఖ్యమంత్రి తన ఫొటో ముద్రించుకోవడం జరుగుతూ వుంటుంది. కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు జగన్ ఎక్కడబడితే తన తండ్రి ఫొటోనో, తన ఫొటోనే ఉండేలా చూసుకుంటూ తన ‘చిత్రానందం’ తీర్చుకుంటూ వున్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని రైతుల పట్టాదారు పాసు పుస్తకాలన్నిటి మీదా తన ఫొటో ముద్రించుకున్నారు. రైతులకు తాతల నుంచో, తండ్రి నుంచో వచ్చిన భూమి అయి వుండవచ్చు. లేదా తానే కష్టపడి సంపాదించుకుని వుండవచ్చు. అలాంటి భూమి పాస్ బుక్ మీద ముఖ్యమంత్రి ఫొటో ముద్రించడం అంత నియంతృత్వం మరొకటి వుంటుందా? ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రీ ఇంతటి తెంపరితనాన్ని ప్రదర్శించలేదు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రైతులలో ఎప్పటి నుంచో ఆగ్రహం వుంది. కానీ, తమ ఆగ్రహాన్ని బయటకి వ్యక్తం చేయలేకపోయారు. ఎందుకంటే, అలా ఆగ్రహం వ్యక్తం చేస్తే తన భూమే తనకు కాకుండా పోయే ప్రమాదం వుంది.. ఇంకా చెప్పాలంటే ప్రాణం కూడా పోయే అవకాశం వుంది. ఎందుకంటే, మాస్కులు లేవన్న పాపానికి డాక్టర్ మీద పిచ్చోడని ముద్ర వేసి, ప్రాణం పోయేంతవరకూ వేధించిన ఘనత జగన్ ప్రభుత్వానికిది. ఇక రాష్ట్రంలో జగన్ ప్రభుత్వానికి రోజులు పూర్తయ్యాయన్న సంకేతాలు స్పష్టంగా వస్తూ వుండటంతో రైతులకు నోరు తెరిచే ధైర్యం వస్తోంది.

ఘనత వహించిన ముఖ్యమంత్రి జగన్ పోటీ చేస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఆయన సతీమణి భారతి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని వేంపల్లెలో పర్యటిస్తున్న ఆమె మాజీ సర్పంచ్ ఇంటికి వెళ్ళి జగన్‌కి ఓటు వేయాలని అభ్యర్థించారు. అప్పుడు మాజీ సర్పంచ్ భర్త భాస్కర్ రెడ్డి భారతి సమక్షంలో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మా తాతల నుంచి వారసత్వంగా వస్తున్న భూముల పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్ ఫొటో ఎందుకు అని ప్రశ్నించారు. జగన్ తన ప్రతి సమావేశంలోనూ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, మైనారిటీ అంటారే తప్ప.. నా రైతు అని ఏనాడూ అనలేదని విమర్శించారు. దీనితోపాటు జగన్ అనుసరిస్తున్న అనేక రైతు వ్యతిరేక విధానాలను భాస్కర్ రెడ్డి ప్రశ్నించారు. భాస్కర్ రెడ్డి ప్రశ్నలకు భారతి సమాధానం చెప్పలేక మౌనం వహించారు.